న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తమ పార్టీ తరఫున పౌరసత్వ బిల్లుకు మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. అయితే అన్ని మతాలను సమానమైన ఆదరణతో చూడాలన్నది తమ పార్టీ అభిమతం అని చెప్పారు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతమైన రాష్ట్రానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు.
హింస, దౌర్జన్యం, అత్యాచారాలకు గురవుతూ ప్రశాంత జీవనానికి నోచుకోని బాధితులు, శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించాలన్నదే తమ పార్టీ సిద్ధాంతం అని అన్నారు. అంతవరకు ఈ బిల్లులోని స్పూర్తిని తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు. దురుద్దేశపూర్వకంగా వలసను ప్రోత్సహించి జాతీయ భద్రతకు ముప్పు కలిగించడాన్ని ఎంత మాత్రం తాము అంగీకరించబోమని ఆయన తెలిపారు.